ధనత్రయోదశి విశిష్టత

http://www.chitravedika.com/

దీపావళికి రెండు రోజులు ముందు వచ్చే ఆశ్వీయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశి అంటారు. దీనినే యమ త్రయోదశి అనీ, ధన్‌తేరస్‌ అనీ, కుబేర త్రయోదశి అనీ, ధన్వంతరీ త్రయోదశి అనీ, ఐశ్వర్య త్రయోదశి అనీ అంటారు. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం ఈ రోజున పూజ చేస్తారు. అయిదు రోజులు జరుపుకునే దీపావళి పండుగలో మొదటి రోజే ధన త్రయోదశి.

ధనత్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవీ పూజ చేస్తారు. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. ఈ రోజున బంగారం కొంటే మంచిదని భావిస్తారు.

ధనత్రయోదశి రోజునే క్షీరసాగరమధనం నుండి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆవిర్భవించింది. అందుకే, ఈ ధనత్రయోదశి పర్వదినాన మహాలక్ష్మీ ని పూజిస్తారు. ధనత్రయోదశి రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. యమధర్మరాజు ఆ ఇంటివైపు రాడు.అలాగే శ్రీ మహా విష్ణువు వామన అవతారమెత్తి బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా అడిగి తీసుకున్నాడు. అప్పుడు వామనుడు భూలోకం మొత్తాన్నీ ఒకే ఒక్క అడుగుతో ఆక్రమించినది కూడా ఈ ధన త్రయోదశి నాడే.

 

పూర్వం హిమ అనే  రాజుకు ఎన్నో పూజల ఫలితంగా మగబిడ్ద పుట్టాడు. ఆ పిల్లవాడు 16వ ఏట పెళ్ళైన నాలుగో రోజే పాము కాటు వల్ల చనిపోతాడని జ్యోతిష్యులు చెబుతారు. యువరాజుకు 16వ ఏట పెళ్ళయింది. యువరాజుకు ఉన్న మరణ గండం గురించి యువరాజు భార్యకు తెలుస్తుంది. అప్పుడు ఆమె ఎలాగైనా యువరాజును కాపాడాలని అనుకుంటుంది. పెళ్ళైన నాలుగో రోజు రాత్రి తన వద్దనున్న బంగారు ఆభరణాలను యువరాజు గది ముందు రాశులుగా పోసింది. ఆ తర్వాత కోటా మొత్తం దీపాలు వెలిగించింది. కోటలోని వారెవ్వరూ నిద్రపొకుండా ఉండటం కోసం కోటలోని వారందరిని కోర్చోబెట్టి కథలు చెప్పింది. యువరాజు జాతక ప్రకారం యముడు యువరాజును కాటెయ్యడానికి వచ్చాడు. కానీ ఆ దీపాల కాంతుల మధ్య ధగా ధగా మెరుస్తున్న ఆభరణాల మెరుపులకు మైమరచిపోయి యముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఈ రోజున దీపాలు వెలిగించే ఆచారం ప్రారంభం అయ్యింది.

ధనత్రయోదశి రోజున సాయంత్రం పూట ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి కుటుంబంలో ఎవ్వరికీ ఆపదలు రాకుండా చూడమని యమధర్మరాజుని కోరుకుంటారు. అందుకే ఈ దీపాలను యమదీపాలు అంటారు. యమధర్మరాజు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి ఇంటి బయట దక్షిణం దిక్కున  ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషించి, అకాల మృత్యువు నుండి కాపాడతాడని నమ్మకం.అంతేకాదు ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి నాడే. ధనత్రయోదశి రోజునే క్షీరసాగరమధనంలో ధన్వంతరి కూడా ఉద్భవించాడు. అనారోగ్యంతో బాధపడే వారికి తగిన మందులను తెలపడానికి శ్రీ మహావిష్ణువు ధన్వంతరి అవతారం ఎత్తాడు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలగాలంటే ధన్వంతరిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *